Srikanth Reddy: ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న సెల్ఫీ సరదా

Srikanth Reddy Family Loses Three Children in Selfie Tragedy
  • బామ్మను చూసేందుకు సిటీ నుంచి పల్లెకు వచ్చిన ముగ్గురు చిన్నారులు
  • పొలం వద్ద ఫోటోలు దిగుతుండగా కాలుజారి నీటి గుంతలో పడిపోయిన వైనం
  • ఈత రాకపోవడంతో కళ్లముందే ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయిన తండ్రి
నాగర్‌కర్నూల్‌ జిల్లా ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని తుర్కయాంజల్‌లో నివసించే శ్రీకాంత్‌రెడ్డి తన తల్లి సరస్వతమ్మను చూసేందుకు భార్యాపిల్లలతో కలిసి శనివారం స్వగ్రామమైన ముచ్చర్లపల్లికి వచ్చారు. ఆదివారం సరదాగా గడిపేందుకు పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ నీటి గుంత పక్కన ఫోటోలు దిగుతున్న సమయంలో, శ్రీమాన్యు (12) ఒక్కసారిగా కాలుజారి నీటిలో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అక్క శ్రీకృతి (14), మేనత్త కూతురు స్నేహ (17) కూడా నీటిలోకి దిగి మునిగిపోయారు.

మరో బాలిక విద్యాధరణిని తండ్రి శ్రీకాంత్‌రెడ్డి సకాలంలో బయటకు లాగగలిగినా, మిగిలిన ముగ్గురిని కాపాడలేకపోయారు. తనకు ఈత రాకపోవడంతో, తన కళ్లముందే బిడ్డలు ప్రాణాలు విడుస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉండిపోవడం అక్కడి వారిని కలిచివేసింది.

 శ్రీమాన్య 6వ తరగతి, శ్రీకృతి 8వ తరగతి చదువుతుండగా, స్నేహ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే ఈ ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వకుర్తి ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Srikanth Reddy
Nagarkurnool
drowning
selfie tragedy
Telangana
lake accident
children death
Mucharlapalli
Kalwakurthy
Anirudh Reddy

More Telugu News