Revanth Reddy: సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్ సూత్రధారి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు

Revanth Reddy Mastermind in Singareni Scam Alleges Harish Rao
  • సింగరేణిలో భారీ అవినీతి జరిగిందన్న హరీశ్ రావు
  • సీఎం రేవంత్ సూత్రధారని, ఆయన బావమరిది లబ్ధిదారుడని ఆరోపణ
  • సైట్ విజిట్ సర్టిఫికెట్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
  • సింగరేణి లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్ తగ్గించారని విమర్శ
  • అవినీతిపై కేంద్రం మౌనం వీడాలని, బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపణ
సింగరేణి కాలరీస్‌లో భారీ అవినీతి జరిగిందని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 'సైట్ విజిట్ సర్టిఫికెట్' నిబంధనతో జారీ చేసిన టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కుంభకోణంపై జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరపాలని కోరారు.

ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సూత్రధారి అని, ఆయన బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన లబ్ధిదారుడని హరీశ్ రావు ఆరోపించారు. నైనీ టెండర్‌ను రద్దు చేయడమే ఇందులో తీవ్ర అక్రమాలు జరిగాయనడానికి నిదర్శనమని అన్నారు. సీఎంకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను మార్చారని విమర్శించారు.

జనవరి 2025లో ఎలాంటి సైట్ విజిట్ నిబంధన లేకుండా అంచనా వ్యయం కంటే 7 శాతం తక్కువకు ఖరారైన భూపాలపల్లి పనుల టెండర్లను, మూడు నెలల్లోనే మే 2025లో కొత్త నిబంధనలతో ఎందుకు జారీ చేశారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మార్పుల వల్ల పోటీ తగ్గి, సీఎం బంధువుకు చెందిన కంపెనీకి అంచనా కంటే ఎక్కువ ధరకు పనులు అప్పగించారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంతో మొదటి లబ్ధి పొందింది సృజన్ రెడ్డికి చెందిన 'శోధా కన్‌స్ట్రక్షన్స్' అని ఆయన పేర్కొన్నారు.

అవినీతిపై సూటిగా సమాధానం చెప్పకుండా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధం లేని పత్రాలు చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. కుంభకోణానికి బాధ్యులెవరు, ఎంత నష్టం వాటిల్లింది, ఎవరు లబ్ధి పొందారనే మూడు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సింగరేణికి వచ్చిన సుమారు రూ. 6,900 కోట్ల లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టి, కార్మికుల బోనస్‌ను తగ్గించిందని కూడా ఆయన ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ అవినీతిపై మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని, సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు.


Revanth Reddy
Singareni Collieries
Harish Rao
Telangana
Corruption
BRS
Srujan Reddy
Naini Tender
Site Visit Certificate
Coal Scam

More Telugu News