Dilraj Singh Gill: కెనడాలో భారత సంతతి యువకుడి హత్య.. గ్యాంగ్ వార్ కారణమని అనుమానాలు

Canada Indian Origin Youth Dilraj Singh Gill Shot Dead
  • మృతుడు మాజీ నేరస్థుడని వెల్లడించిన పోలీసులు
  • బర్నబే నగరంలో సాయంత్రం నడి వీధిలో కాల్పులు
  • యువకుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదన్న పోలీసులు
కెనడాలో భారత సంతతి యువకుడు హత్యకు గురయ్యాడు. నడి వీధిలో దుండగులు కాల్పులు జరిపి అతడిని చంపేశారు. బర్నబే సిటీలో ఈ హత్య జరిగింది. కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకోవర్ సిటీకి చెందిన భారత సంతతి యువకుడు దిల్ రాజ్ సింగ్ గిల్ (28) గురువారం బర్నబే సిటీకి వెళ్లాడు. అక్కడ గుర్తుతెలియని దుండగులు గిల్ పై కాల్పులు జరిపారు.

సాయంత్రం 5:30 గంటల సమయంలో 3700 కెనడా వే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ గాయాలతో పడి ఉన్న గిల్ ను రక్షించే ప్రయత్నం చేశారు. కాగా, మృతుడు గిల్ కు నేర చరిత్ర ఉందని, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం గ్యాంగ్ వార్ కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, బక్సటన్ స్ట్రీట్ లో ఓ కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Dilraj Singh Gill
Canada
Indian origin
Murder
Gang war
Vancouver
Burnaby
Shooting

More Telugu News