Union Budget 2026-27: బడ్జెట్‌కు ముందు మార్కెట్ల బెరుకు.. తర్వాత జోరు.. గతం రిపీట్ అవుతుందా?

Why stock markets often trade lower ahead of Union Budgets
  • కేంద్ర బడ్జెట్‌కు ముందు మార్కెట్లు బలహీనపడటం ఓ ట్రెండ్
  • బడ్జెట్ తర్వాత వారంలో మార్కెట్లు పుంజుకోవడం సాధారణమే అంటున్న నిపుణులు
  • మౌలిక వసతులు, రక్షణపై కేటాయింపులు పెరగొచ్చని అంచనా
  • బడ్జెట్ తర్వాత స్పష్టత వచ్చేవరకూ వేచిచూడాలని నిపుణుల సూచన
కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ స్టాక్ మార్కెట్ల కదలికలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బడ్జెట్‌లో ఎలాంటి అనూహ్య ప్రకటనలు ఉంటాయోనన్న భయంతో ఈవెంట్‌కు ముందు మార్కెట్లు సాధారణంగా బలహీనపడతాయని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటాయని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం 2010 నుంచి 2022 మధ్య కాలాన్ని పరిశీలిస్తే.. బడ్జెట్‌కు వారం రోజుల ముందు నిఫ్టీ సగటున 0.52 శాతం నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది. బడ్జెట్ రోజున అధిక ఒడిదొడుకులు నమోదవుతుండగా ఆ తర్వాత వారంలో మాత్రం మార్కెట్లు సగటున 1.36 శాతం లాభపడినట్లు డేటా చెబుతోంది. గత ఐదేళ్లలో నాలుగుసార్లు బడ్జెట్‌కు ముందు నెలలో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది.

ఈసారి బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిస్తూనే, ద్రవ్యలోటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు రాహుల్ శర్మ అంచనా వేశారు. అమెరికా టారిఫ్‌ల వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలు, రక్షణ, రైల్వే రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచవచ్చని భావిస్తున్నారు. అలాగే, జీఎస్టీ రీఫండ్‌లను వేగవంతం చేయడం ద్వారా ఎంఎస్ఎంఈ, తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఎగుమతి రంగాలకు ప్రోత్సాహం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయవచ్చని రాహుల్ శర్మ పేర్కొన్నారు. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి ఇది 4.2-4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

అయితే, కొన్ని రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రకటించే ఉద్దీపన చర్యలు అంచనాలకు తగ్గట్టు లేకపోయినా, ద్రవ్యలోటు లక్ష్యాలు తప్పినా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య సమస్యలు, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసే దేశీయ అంశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల బడ్జెట్ తర్వాత స్పష్టత వచ్చేవరకు ఇన్వెస్టర్లు వేచిచూడటం మంచిదని, రక్షణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల వంటి ఎంపిక చేసిన రంగాలపై దృష్టి పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Union Budget 2026-27
Stock Markets
Nifty
Rahul Sharma
JM Financial Services
Fiscal Deficit
GDP
MSME
Investment
Indian Economy

More Telugu News