Haryana: అంకెలు రాయలేదని.. నాలుగున్నరేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి!

Father beats 4 year old daughter to death in Faridabad for failing to write numbers
  • 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో తండ్రి ఘాతుకం
  • మెట్లపై నుంచి పడిపోయిందని కట్టుకథ అల్లిన వైనం
  • పాప శరీరంపై గాయాలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
  • విచారణలో నేరం అంగీకరించిన తండ్రి కృష్ణ జైస్వాల్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో నాలుగున్నరేళ్ల కన్నకూతురిని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... పాపను కొట్టిన తర్వాత, ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, పనిలో ఉన్న భార్యకు ఫోన్ చేసి, పాప ఆడుకుంటూ మెట్లపై నుంచి పడిపోయి చనిపోయిందని కట్టుకథ చెప్పాడు. అయితే, ఆసుపత్రికి చేరుకున్న తల్లి, పాప శరీరంపై, ముఖంపై గాయాలు, కమిలిన గుర్తులు చూసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, తండ్రి కృష్ణ జైస్వాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన కృష్ణ, తన భార్యతో కలిసి ఫరీదాబాద్‌లోని ఝర్‌సైంత్లీ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు, హత్యకు గురైన నాలుగేళ్లన్నర కూతురు, రెండేళ్ల చిన్న కూతురు ఉన్నారు.

భార్యాభర్తలిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. పగటిపూట కృష్ణ పిల్లలను చూసుకుంటుండగా, రాత్రి భార్య చూసుకుంటుంది. ఈ నెల‌ 21న ఇంట్లో కూతురికి చదువు చెబుతున్న సమయంలో 50 వరకు అంకెలు రాయమని చెప్పగా పాప రాయలేకపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ, కూతురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పాప స్కూల్‌కు వెళ్లడం లేదని, తానే ఇంట్లో చదివిస్తున్నానని, అంకెలు సరిగా రాయలేకపోవడంతో కోపం వచ్చి కొట్టానని నిందితుడు విచారణలో చెప్పాడు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీస్ రిమాండ్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Haryana
Krishna Jaiswal
Faridabad
child abuse
murder
crime
domestic violence
police investigation
Sonbhadra
Uttar Pradesh

More Telugu News