Bhatti Vikramarka: సింగరేణిపై విషపురాతలు.. ఎవరి కోసం?: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Condemns Conspiracy Against Singareni
  • ఎవరికి లబ్ది చేకూర్చడానికో ప్రజలకు తెలియాలన్న ఉప ముఖ్యమంత్రి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
  • రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడతానని ప్రకటన
సింగరేణి ఆస్తులను కొంతమందికి కట్టబెట్టే ప్లాన్ తో, కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విషపు రాతలు రాస్తున్నారంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషపు రాతల వల్ల రాష్ట్రానికి, సింగరేణికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం ప్రజాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణిపై అసత్య ప్రచారాల వెనక కుట్ర దాగి ఉందని, సింగరేణి ఆస్తులు కాజేసే ప్లాన్ ఉందని ఆరోపించారు.

టెండర్లపై అపోహలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడతానని ఆయన చెప్పారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాయడాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపిస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయని చెప్పారు.

2018లోనే సైట్ విజిట్ నిబంధన..
కోల్ ఇండియా టెండర్ డాక్యుమెంట్ ను కేంద్ర ప్రభుత్వం 2018లో తయారు చేసిందని, అప్పుడే సైట్ విజిట్ తప్పనిసరి అనే నిబంధన పెట్టిందని భట్టి విక్రమార్క చెప్పారు. 2021లో కేంద్ర గనుల శాఖ కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని చెప్పిందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని ఆయన గుర్తుచేశారు. గత డాక్యుమెంట్లలోని నిబంధనల ఆధారంగానే ఇటీవల సింగరేణి టెండర్లు పిలిచిందని చెప్పారు. అయితే, మేమే ఈ నిబంధన పెట్టినట్లు పత్రికలు, నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka
Singareni Collieries
Telangana
Coal India
Naini Coal Block
Harish Rao
Kishan Reddy
Coal tenders
Mining
BRS

More Telugu News