RTC Bus Theft: విశాఖలో వింత చోరీ.. మద్యం కోసం ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు!

Man Steals Apsrtc Hire Bus To Sell Diesel In Visakhapatnam
  • విశాఖలో కలకలం రేపిన ఆర్టీసీ బస్సు చోరీ
  • మద్యం డబ్బుల కోసం బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడు
  • బస్సులో డీజిల్ అమ్మేసిన డ్రైవర్ పైడిరాజు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
  • గతంలోనూ ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తింపు
విశాఖపట్నంలో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. కేవలం మద్యం తాగేందుకు డబ్బులు లేవని ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టీవీ నాయుడు అనే వ్యక్తి తన ఆరు బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ నెల 16న రాత్రి శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏపీ 39యూఎక్స్ 2888 నంబర్ గల బస్సు డ్రైవర్ అప్పారావు, బస్సుకు 197 లీటర్ల డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించారు. రాత్రి 9:45 గంటల సమయంలో మద్దిలపాలెం డిపోలోని పార్శిల్ కౌంటర్ పక్కన బస్సును పార్క్ చేసి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. మరుసటి రోజు (17వ తేదీ) ఉదయం 5 గంటలకు వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. దీంతో బస్సు యజమాని టీవీ నాయుడు, డ్రైవర్ అప్పారావు ఒక రోజంతా చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మద్దిలపాలెం డిపోతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. యజమాని టీవీ నాయుడు దగ్గర పనిచేసే అనకాపల్లి జిల్లాకు చెందిన ఈగల పైడిరాజు అనే మరో డ్రైవర్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు తెలియడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ నెల 19న మధ్యాహ్నం రామా టాకీస్ సమీపంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రి దగ్గర పైడిరాజు సదరు బస్సును నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను మద్యానికి బానిసనని, బస్సులోని డీజిల్ అమ్ముకుని ఆ డబ్బుతో మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సును దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. పైడిరాజు ఇలాంటి నేరం చేయడం ఇది మొదటిసారి కాదని పోలీసులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో కూడా ద్వారకానగర్ బస్టాండ్‌లో ఇదే యజమానికి చెందిన బస్సును దొంగిలించి, డీజిల్ అమ్ముకుని రూ.4 వేలు సంపాదించాడని, ఆ తర్వాత బస్సును బయ్యవరం హైవేపై వదిలేసి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై అప్పట్లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
RTC Bus Theft
Visakhapatnam
bus stolen for alcohol
Andhra Pradesh crime
Maddilapalem depot
Eegala Paidiraju
diesel theft
Vizag crime news

More Telugu News