Bandi Sanjay: సిరిసిల్ల కేంద్రంగా కేటీఆర్ అక్రమంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు: బండి సంజయ్

Bandi Sanjay Alleges KTR Illegally Tapped Phones
  • సిట్ విచారణ సీరియల్‌లా సాగుతోందని ఎద్దేవా
  • సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆగ్రహం
  • కేసీఆర్ దారుణాలతో కొన్ని కుటుంబాలు నిండా మునిగాయని విమర్శ
  • కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే ధైర్యం లేదని వ్యాఖ్య
సిరిసిల్లను కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేయించారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్‌ మాదిరిగా సాగుతోందని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ చేసిన దారుణాల వల్ల కొన్ని కుటుంబాలు నిండా మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అరెస్టులు జరగవని అన్నారు. అవినీతి, అక్రమ కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. దేశ భద్రత కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటుందని, దానికి తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.

మావోయిస్టుల పేరుతో హీరోయిన్లు, వ్యాపారులు, రాజకీయ నేతలు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో మంచి అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కానీ వారికి ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా విచారణ జరిపే అవకాశం లేకుండా పోయిందని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకునే వాళ్లమని అన్నారు. తప్పు చేసిన నేతలు, అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay
KTR
BRS
Phone Tapping Case
Telangana Politics
Revanth Reddy
SIT Investigation

More Telugu News