Palash Muchhal: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు

Smriti Mandhanas Ex Boyfriend Palash Muchhal Faces Cheating Allegations
  • ప్రముఖ సింగర్ పలాశ్‌ ముచ్చల్‌పై రూ. 40 లక్షల మోసం కేసు నమోదు
  • సినిమా నిర్మాణం పేరుతో డబ్బు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపణ
  • క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే ఫిర్యాదు
  • ప్రాజెక్ట్ ఆగిపోవడంతో డబ్బు అడిగితే నంబర్ బ్లాక్ చేశారని ఆరోపణ
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్ తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడైన వైభవ్ మానే వృత్తిరీత్యా సినీ ఫైనాన్షియర్. సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ద్వారా పలాశ్‌ ముచ్చల్ అతనికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో "నజరియా" అనే సినిమా తీస్తున్నానని, పెట్టుబడి పెడితే ఓటీటీలో విడుదల చేసి త్వరగా లాభాలు అందిస్తానని పలాశ్‌ హామీ ఇచ్చారని వైభవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పలాశ్‌ ముచ్చల్‌ మాటలు నమ్మి, వైభవ్ మానే సినిమా నిర్మాణం కోసం మొత్తం రూ. 40 లక్షలను పలు వాయిదాలలో నగదు, గూగుల్ పే ద్వారా అందించారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, పత్రాలను కూడా పోలీసులకు సమర్పించారు. అయితే, ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని వైభవ్ అడగగా, మొదట హామీ ఇచ్చిన పలాశ్ ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేసి, చివరికి అతని నంబర్‌ను బ్లాక్ చేశారని బాధితుడు ఆరోపించారు.

నెలల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైభవ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైభవ్ సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు జరుగుతోంద‌ని తెలిపారు. కాగా, గతంలో క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్‌ ముచ్చల్ పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటుడు శ్రేయాస్ తల్పడేతో తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Palash Muchhal
Smriti Mandhana
cheating case
Vaibhav Mane
financial fraud
Bollywood
Sangli
Shreyas Talpade
Nazariya movie
film production

More Telugu News