Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

Pawan Kalyan Keeps His Word Kotappakonda New Road Inaugurated Before Shivaratri
  • కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
  • శివరాత్రికి ముందే రోడ్డు పూర్తి చేస్తామన్న హామీని నెరవేర్చిన పవన్
  • లక్షన్నర మంది భక్తులతో పాటు స్థానిక రైతులకు, విద్యార్థులకు ప్రయోజనం
  • గిరిప్రదక్షణ మార్గం నమూనా, జింకల పార్కును పరిశీలించిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. శివరాత్రి ఉత్సవాలలోపు రహదారి సౌకర్యం కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తూ... కోటప్పకొండ - కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని గురువారం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించారు.

కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రోడ్డుపై కొంత దూరం నడిచి, నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఈ రోడ్డు ఆవశ్యకతను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్, శివరాత్రి నాటికి రోడ్డును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ నూతన రహదారితో మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అంతేకాకుండా, కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడనుంది. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పవన్ కల్యాణ్‌ను కలిసి, తమ కోసం రహదారి నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాలకు క్రీడా మైదానంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. కోటప్పకొండలో చేపట్టనున్న గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్‌తో పాటు, జింకల పార్కును కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇన్‌ఛార్జ్ సయ్యద్ జిలాని, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.


Pawan Kalyan
Kotappakonda
Andhra Pradesh
Maha Shivaratri
Road Construction
Trikoteswara Swamy
New Road Inauguration
Guntur District
Janasena
Rural Development

More Telugu News