Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్

Nara Lokesh Meets Revanth Reddy at Davos
  • పరస్పర సహకారంతో అభివృద్ధిపై ఇరు నేతల చర్చ
  • ఏపీ విద్యా సంస్కరణలు, ఐటీ ప్రగతిని వివరించిన నారా లోకేశ్
  • తెలంగాణ స్కిల్ క్యాంపస్‌లను చూడాలని లోకేష్‌కు రేవంత్ ఆహ్వానం
  • మేడారం జాతరకు రావాలని లోకేష్‌ను ఆహ్వానించిన సీఎం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి ప్రణాళికలపై ఇరువురు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో భాగంగా మంత్రి నారా లోకేశ్... సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేశ్ ను సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. 

దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ముఖ్యంగా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణలోని ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ క్యాంపస్‌లను సందర్శించి, అక్కడ అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించాలని లోకేశ్ ను ఆయన ఆహ్వానించారు. 

అలాగే, కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానాన్ని వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చూపని చొరవతో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, తప్పకుండా వనదేవతలను దర్శించుకోవాలని లోకేష్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతూనే, అభివృద్ధి విషయంలో సహకరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళితే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
Nara Lokesh
Revanth Reddy
Davos
AP Model of Education
Telangana
Andhra Pradesh
IT Development
Skill Development
Medaram Sammakka Saralamma
Telugu States Development

More Telugu News