KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్

KTR Alleges Revanth Reddy Plot to Abolish Sircilla District
  • సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందన్న కేటీఆర్
  • అన్ని వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు
  • ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్న కేటీఆర్

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగరబోతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలపై వార్డుల ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. మెజారిటీ కాదు.. అన్ని వార్డులు గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.


సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్‌ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. “మన పని మనమే చెప్పుకోవాలి.. వేరే వాళ్లు చెప్పరు” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు లేవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని గుర్తుచేస్తూ, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ అంశం ప్రజల్లో, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. రేవంత్ పాలనను తుగ్లక్ తరహా పాలనగా అభివర్ణించారు.


సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్‌లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలకు భయపడుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు బీఆర్‌ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందని, బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పెట్టిందో గడపగడపకు తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు, బతుకమ్మ చీరలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లు, నేతన్నల సమస్యలు అన్నింటినీ ప్రజలకు వివరించాలని సూచించారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.


సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను తానే నేరుగా పర్యవేక్షిస్తానని ప్రకటించిన కేటీఆర్... ప్రజలు ఎప్పుడూ గులాబీ జెండా వైపేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు ఇంచార్జి ఇంటింటి ప్రచారం చేసి, అభివృద్ధిని చెప్పి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

KTR
KT Rama Rao
Sircilla
Rajanna Sircilla
Revanth Reddy
BRS
Congress
Telangana Politics
Municipal Elections
Telangana

More Telugu News