Revanth Reddy: రేవంత్ రెడ్డిలో రాము, రెమో.. ఇద్దరూ ఉన్నారు: కేటీఆర్

KTR Slams Revanth Reddy Dual Personality
  • సినిమా టిక్కెట్లు పెంచబోమని చెబుతూనే, ధరల పెంపుకు జీవో జారీ చేస్తారని విమర్శ
  • సర్వాయి పాపన్న పేరుపై జిల్లా చేస్తామని చెబుతూనే జనగామ జిల్లాను తొలగిస్తామంటున్నారని ఆగ్రహం
  • మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్
  • జనసేన సహా ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో రెండు కోణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటి 'రాము' అయితే, మరొకటి 'రెమో' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు సినిమా టిక్కెట్లను పెంచబోమని చెబుతూనే, మరోవైపు టిక్కెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేస్తోందని అన్నారు. సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తామని చెబుతూనే, తిరిగి అదే జిల్లాను తొలగిస్తామని చెబుతున్నారని విమర్శించారు. అందుకే ఆయనలో రాము, రెమో కోణాలు ఉన్నాయని చెబుతున్నామని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 40 శాతం సర్పంచ్‌లను గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికలు శివరాత్రి లోపలే ముగుస్తాయని అభిప్రాయపడిన కేటీఆర్, తాము ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చేది అసెంబ్లీ ఎన్నికలేనని జోస్యం చెప్పారు.

పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిన మాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. సర్వేలు, పార్టీ బలాబలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో జనసేనతో సహా ఎవరైనా పోటీ చేయవచ్చని అన్నారు. క్షేత్రస్థాయిలో బలం ఉంటేనే స్థానిక ఎన్నికల్లో గెలవడం సులభమవుతుందని అన్నారు. జనగామ, నారాయణపేట సహా పలు జిల్లాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జిల్లాలను రద్దు చేయడం ఖాయమని అన్నారు.

స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికార పార్టీ నాయకులు ఆరోపణలను నిరూపించలేకపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో జంట నగరాల అస్థిత్వం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు.
Revanth Reddy
KTR
BRS
Telangana politics
Municipal elections
సర్వాయి పాపన్న Sarvai Papanna

More Telugu News