Sunita Williams: ఇక నింగికి వీడ్కోలు.. 'స్టార్' ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ పదవీ విరమణ!

Sunita Williams Retires From NASA After Historic Space Career
  • ముగిసిన సునీత 27 ఏళ్ల అద్భుత ప్రస్థానం
  • నాసాలో మూడు కీలక మిషన్లు చేపట్టిన సునీత
  • సుదీర్ఘ సేవ తర్వాత సునీతా విలియమ్స్ రిటైర్మెంట్
  • స్పేస్‌లో అత్యధిక కాలం గడిపిన మహిళా వ్యోమగాముల్లో ఒకరిగా అరుదైన రికార్డు
  • అత్యధిక సార్లు అంతరిక్షంలో నడిచిన మహిళగా చరిత్ర సృష్టించిన సునీత
అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక శకం ముగిసింది. భారత సంతతికి చెందిన ధీశాలి, నాసా స్టార్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) అంతరిక్ష ప్రయాణాలకు వీడ్కోలు పలికారు. ఆమె పదవీ విరమణ చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అధికారికంగా ప్రకటించింది. నిజానికి గతేడాది డిసెంబరు 27 నుంచే ఈ రిటైర్మెంట్ అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది.

రికార్డుల రారాణి: 1998లో నాసాలో చేరిన సునీత తన 27 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. మొత్తం మూడు అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్న ఆమె కక్ష్యలో 608 రోజుల పాటు గడిపారు. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ ఆమెను 'మానవ అంతరిక్ష ప్రయాణాల్లో ఒక మార్గదర్శి' (Trailblazer) గా అభివర్ణించారు. అంతరిక్షంలో మారథాన్ రన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.

ముగిసిన స్టార్‌లైనర్ ఉత్కంఠ: ఆమె కెరీర్‌లో చివరి మిషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా కేవలం 10 రోజుల పర్యటన కోసం వెళ్లిన సునీత, అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. ఆ 10 రోజుల యాత్ర కాస్తా 286 రోజుల సుదీర్ఘ నిరీక్షణగా మారింది. ఎట్టకేలకు 2025 మార్చి 18న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె క్షేమంగా భూమికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణ ఆమె మనోధైర్యానికి నిదర్శనంగా నిలిచింది.

 స్ఫూర్తిదాయకం: సునీతా విలియమ్స్ పదవీ విరమణ చేసినా, ఆమె చేసిన పరిశోధనలు భవిష్యత్తులో జరగబోయే 'ఆర్టెమిస్' (చందమామపైకి పంపే మిషన్), అంగారక గ్రహ యాత్రలకు పునాదిగా నిలుస్తాయని నాసా పేర్కొంది. ప్రస్తుతం ఆమె భారత్ పర్యటనలో వున్నారు. తన తండ్రి స్వదేశమైన భారత్‌తో కలిసి ఇస్రో (ISRO) ప్రాజెక్టులలో ఏవైనా సలహాలు అందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Sunita Williams
NASA
Astronaut
Space mission
Boeing Starliner
ISRO
SpaceX Dragon
Artemis mission
International Space Station
Indian origin

More Telugu News