Mark Carney: అమెరికా ఆధిపత్యం ముగిసింది.. దావోస్‌లో కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Mark Carney Canada PM criticizes US hegemony at WEF
  • నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థ ముగిసిపోయిందన్న మార్క్ కార్నీ
  • పెద్ద దేశాలు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపణ
  • చిన్న దేశాలు కొత్త కూటములు కట్టాలని, లేదంటే నష్టపోతాయని హెచ్చరిక
  • పాత వ్యవస్థ మళ్లీ రాదని, గతాన్ని తలుచుకోవడం వ్యూహం కాదని స్పష్టీకరణ
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)పై కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ సంచలన ప్రసంగం చేశారు. దశాబ్దాలుగా అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అంతర్జాతీయ వ్యవస్థ ఇక అంతమైందని ఆయన ప్రకటించారు. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్య దేశాలు 'బలిపశువులు' కాకుండా తమను తాము రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.

"మనం ఇన్నాళ్లూ అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నాం.. కానీ అది పాక్షికంగా ఒక అబద్ధం" అని కార్నీ పేర్కొన్నారు. శక్తిమంతులు తమకు నచ్చినప్పుడు నిబంధనల నుంచి మినహాయింపు పొందడం, బలహీనులపై వాటిని రుద్దడం వంటి 'అసమానతల'పై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లూ అమెరికా ఆధిపత్యం వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు కనుమరుగయ్యాయని, పాత వ్యవస్థ మళ్ళీ తిరిగి రాదని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రపంచంలో 'ఆర్థిక అనుసంధానం' అనేది అభివృద్ధికి మార్గం కాకుండా, ఒకరిని ఒకరు లొంగదీసుకునే 'ఆయుధం'గా మారిందని కార్నీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుంకాలు, సరఫరా గొలుసులను అడ్డుపెట్టుకుని పెద్ద దేశాలు చిన్న దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ అంశంలో ఇతర దేశాలపై టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కెనడా తన వ్యూహాలను మార్చుకుంటోందని కార్నీ వెల్లడించారు. ఇటీవల చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలతో పెంచుకుంటున్న బంధం ఇందులో భాగమేనని తెలిపారు. "మనం చర్చల బల్ల దగ్గర లేకపోతే, మనం ఇతరులకు భోజనంగా (వనరులుగా) మారిపోయే ప్రమాదం ఉంది" అంటూ మధ్యేమార్గ దేశాలు ఐక్యం కావాలని కోరారు.
Mark Carney
Canada
Davos
World Economic Forum
America dominance
Globalization
Tariff war
China trade
International relations
Geopolitics

More Telugu News