Chamala Kiran Kumar Reddy: హరీశ్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy Harish Rao Playing Tricks in Phone Tapping Case
  • హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా ఏం జరిగిందో సమాజానికి తెలియజెప్పేందుకే సిట్ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడి
  • విచారణలో బయటపడే నిజాలను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారన్న కిరణ్ కుమార్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ట్రిక్ ప్లే చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలుస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిట్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలియజెప్పేందుకే సిట్ దర్యాప్తు కొనసాగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే విచారణలో బయటపడే నిజాలను దాచిపెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీశ్ రావు, కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. సృజన్ రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడని, గతంలో తన అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారని ఆయనే ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కూడా సృజన్ రెడ్డి సహా పలువురికి కాంట్రాక్టులు దక్కాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా దోచుకునే ఆలోచన లేదన్నారు.

సింగరేణిలో నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉందని, లోక్‌సభ సభ్యుడిగా ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్, హరీశ్ రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. హిల్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం చర్చ మాత్రమే చేసిందని, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షల కోట్ల అవినీతి అంటూ కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని మాజీ ఎమ్మెల్సీ కవిత స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలు తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 
Chamala Kiran Kumar Reddy
Harish Rao
Telangana
Phone Tapping Case
BRS
Revanth Reddy
KTR
Srujan Reddy
Singareni
Corruption

More Telugu News