Harish Rao: సిట్ నన్ను అడగడం కాదు.. నేనే సిట్‌కు వంద ప్రశ్నలు వేశా: ఏడు గంటల విచారణ అనంతరం హరీశ్ రావు

Harish Rao Questions SIT After Interrogation in Phone Tapping Case
  • దమ్ముంటే ఈరోజు విచారణకు సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని సవాల్
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకేం సంబంధమని ప్రశ్న
  • అప్పుడు నేను హోంమంత్రిగా పని చేశానా అని నిలదీత
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనను ప్రశ్నించడం కాదని, తానే సిట్‌కు వంద ప్రశ్నలు వేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. దమ్ముంటే ఈరోజు విచారణకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను హోంమంత్రిగా ఎప్పుడైనా పని చేశానా అని వ్యాఖ్యానించారు. నాటి డీజీపీ, చీఫ్ ఇంటెలిజెన్స్‌ను కూడా విచారణకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నోటీసులు, విచారణలు బీఆర్ఎస్‌ను భయపెట్టలేవని ఆయన అన్నారు. రేపు ప్రజా కోర్టులో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అరెస్టులు తమకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ముగ్గురు అధికారులతో కూడిన సిట్ దర్యాప్తు బృందం తనను ప్రశ్నించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయతీపరుడైతే ఈ అంశంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికిపందలా పోలీసులను వెనుకబెట్టుకుని కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, సిట్ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆయన అన్నారు.

వారి కుంభకోణాలు, చీకటి రాజకీయాలను బయటపెడుతున్నామని తమపై కేసులు పెడుతున్నారని హరీశ్ ఆరోపించారు. మీ దోపిడీలను ప్రశ్నిస్తున్నామని, మాపై కేసులు పెడతారా అని నిలదీశారు. తమపై అన్నీ నిరాధార ఆరోపణలేనని, సొల్లు పురాణాలేనని విమర్శించారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష వింటేనే రోత పుడుతోందని అన్నారు.

రేవంత్ రెడ్డిలా తమకు వెన్నుపోట్లు తెలియవని, పోరాటాలు మాత్రమే తెలుసని ఆయన అన్నారు. కేసీఆర్ తమకు నేర్పింది పోరాటమే అన్నారు. ఇప్పుడు తనకు సిట్ ద్వారా వచ్చిన నోటీసులు మీ పతనానికి నాంది అని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలని అన్నారు. మీ చిల్లర, బురద, కుట్ర, కుతంత్రాల రాజకీయాలు ఇక నడవవని అన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు విస్మరించారని ఆరోపించారు.
Harish Rao
Telangana phone tapping case
BRS
SIT investigation
Revanth Reddy
Telangana politics

More Telugu News