Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు: దావోస్‌లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Andhra Pradesh is the Best Investment Destination
  • దావోస్ లో చంద్రబాబు టీమ్ బిజీ బిజీ
  • ఒక్కసారి ఏపీకి వచ్చి చూడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు 
  • కూటమి ప్రభుత్వ వ్యాపార వేగం కళ్లారా చూడాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళవారం సీఐఐ నిర్వహించిన "ఇండియా ఎట్ ది సెంటర్: ది జాగ్రఫీ ఆఫ్ గ్రోత్ - ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్" అనే సెషన్‌లో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం (స్ట్రాటజిక్ అడ్వాంటేజ్) అని పారిశ్రామిక దిగ్గజాలకు చెప్పినట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. "భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) దాదాపు నాలుగో వంతు వాటాతో, మా వ్యాపార నిర్వహణ వేగం ఏపీని ఒక ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టింది. దీర్ఘకాలిక వృద్ధి కోసం మాతో భాగస్వాములు కావాలని ప్రపంచ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

2047 నాటికి భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని, ఈ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని అధికారిక విడుదల వెల్లడించింది. ఈ సెషన్‌లో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఫ్యూయల్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలపై చర్చ జరిగింది.

భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ మద్దతు
వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు నాయుడు విస్తృతంగా వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామికవేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే కనెక్టివిటీ వంటి అంశాలపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్‌లను వినియోగించనున్నట్లు, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రోన్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలే తమ బలం అని సీఎం పేర్కొన్నారు. రాబోయే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

దావోస్ అనుభవం, మారిన పరిస్థితులు
"నేను దశాబ్దాలుగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదికకు హాజరవుతున్నాను. ప్రతిసారీ ఇక్కడికి వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాను. కొత్త ఆలోచనలను పంచుకుంటాను. టెక్నాలజీతో సహా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని, దానికి అనుగుణంగా విధానాలను రూపొందిస్తాను. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని రాష్ట్రాన్ని వ్యాపార అనుకూల రాష్ట్రంగా మారుస్తున్నాం" అని చంద్రబాబు అన్నారు.

"నాలెడ్జ్ ఎకానమీ (జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ) దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుంది. సంపద సృష్టి జరుగుతుంది. భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలం. ప్రపంచంలో మరే దేశానికీ లేని యువశక్తి భారత్‌కు ఉంది. దేశానికి ప్రస్తుతం అసమానమైన, సమర్థవంతమైన నాయకత్వం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలను తీసుకురావడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. తెలుగు ప్రజల విజయాలు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఒక సానుకూల అంశంగా మారాయి" అని చంద్రబాబు వివరించారు.
Chandrababu Naidu
Andhra Pradesh investments
Davos WEF
AP economic growth
FDI India
Andhra Pradesh advantage
Green energy AP
AP drone ambulances
Knowledge economy India
AP industrial policy

More Telugu News