Hema: నా గురించి వచ్చే వార్తలను చూసి నవ్వొస్తుంది: హేమ
- కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న హేమ
- ఎవరికీ తలవంచకుండా జీవించడమే తనకు ముఖ్యమని వ్యాఖ్య
- జీవనం కష్టమైతే దోశల బండి పెట్టుకుని బతుకుతానన్న హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన శైలితో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఒకప్పుడు ఆమె లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అంత బిజీగా ఆమె ఉండేది. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ప్రస్తుతం అవకాశాలు తగ్గినప్పటికీ అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.
ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజోలు వంటి పట్టణం నుంచి మధ్యతరగతి నేపథ్యంతో వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం వెనుక ఎదుర్కొన్న కష్టాలను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదురైనప్పటికీ ఒక్కరోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపింది.
తన ఆర్థిక పరిస్థితిపై వచ్చే వార్తలను చూసి నవ్వొస్తుందని... ఎన్ని కోట్ల ఆస్తి ఉందన్నది కాదు, ఎవరికీ తలవంచకుండా జీవించడమే తనకు ముఖ్యమని హేమ స్పష్టం చేసింది. రేపు సినిమాలు లేకపోయినా, జీవనం కష్టమైనా ఒక దోశల బండి పెట్టుకుని బతుకుతాను కానీ ఎవరి దగ్గర చేయి చాచను అంటూ ధైర్యంగా చెప్పింది. సమాజంలో కష్టకాలంలో ఆదుకునేవారికంటే దూరమయ్యేవారే ఎక్కువని, అయితే తన స్వభావాన్ని ఇష్టపడే వారు ఆడపడుచులా గౌరవిస్తారని తెలిపింది.