US Visa: యూఎస్ వీసాకు కొత్త బాండ్ విధానం.. కొన్ని దేశాలకు కఠిన నిబంధనలు

US Visa New Bond System Stricter Rules for Some Countries
  • కొన్ని దేశాల వారికి అమెరికా వీసా కోసం కొత్త బాండ్ విధానం
  • బిజినెస్, టూరిస్ట్ వీసాలకు 5,000 నుంచి 15,000 డాలర్ల వరకు బాండ్
  • నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ మొత్తాన్ని జప్తు చేయనున్న అధికారులు
  • నిర్ణీత విమానాశ్రయాల నుంచే రాకపోకలు సాగించాలన్న నిబంధన
  • ఈ కొత్త నిబంధనల జాబితాలో భారత్‌కు మినహాయింపు
అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా బిజినెస్ (B1) లేదా టూరిస్ట్ (B2) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆ దేశ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని ఎంపిక చేసిన దేశాల పౌరులకు కొత్తగా 'వీసా బాండ్' విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధన కింద, వీసా మంజూరు చేయడానికి ముందు దరఖాస్తుదారులు 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల (సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.13.6 లక్షలు) వరకు బాండ్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఏయే దేశాలకు వర్తిస్తుంది?
ఈ పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం 38 దేశాలను గుర్తించారు. ఈ జాబితాలో అల్జీరియా, అంగోలా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, నైజీరియా, అల్జీరియా, అంగోలా, క్యూబా, ఉగాండా, వెనిజులా, జాంబియా, జింబాబ్వే, తజికిస్థాన్, టాంజానియా, ఫిజీ వంటి దేశాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ నిబంధన కేవలం ఎంపిక చేసిన దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.

బాండ్ విధానం ఎలా పనిచేస్తుంది?
వీసా ఇంటర్వ్యూ సమయంలో కాన్సులేట్ అధికారి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌ను పరిశీలించి బాండ్ అవసరమా? లేదా? అని నిర్ణయిస్తారు. బాండ్ అవసరమని భావిస్తే 5,000, 10,000, లేదా 15,000 డాలర్లలో ఎంత మొత్తం చెల్లించాలో కూడా వారే నిర్దేశిస్తారు. అలా నిర్దేశించిన తర్వాత, దరఖాస్తుదారులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఫారం I-352 పూర్తి చేసి, యూఎస్ ట్రెజరీ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే బాండ్ మొత్తాన్ని చెల్లించాలి. ఇతర థర్డ్-పార్టీ వెబ్‌సైట్ల ద్వారా చెల్లింపులు చేయవద్దని, అలాంటి వాటికి తాము బాధ్యత వహించబోమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాన్సులర్ అధికారి సూచన లేకుండా బాండ్ చెల్లించినా, ఆ మొత్తం తిరిగి రాదు. ముఖ్యంగా, బాండ్ చెల్లించినంత మాత్రాన వీసా వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు.

ప్రయాణ నిబంధనలు.. బాండ్ వాపసు
బాండ్ చెల్లించి వీసా పొందిన వారు అమెరికాకు ప్రయాణించేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విమానాశ్రయాల ద్వారానే ప్రయాణించాలి. ప్రస్తుతం బోస్టన్ లోగాన్, న్యూయార్క్ జేఎఫ్‌కే, వాషింగ్టన్ డల్లెస్ (IAD) విమానాశ్రయాలను గుర్తించారు. త్వరలో నెవార్క్, అట్లాంటా, చికాగో ఓ'హేర్, లాస్ ఏంజిల్స్ వంటి మరిన్ని ఎయిర్‌పోర్టులను ఈ జాబితాలో చేర్చనున్నారు. ఈ నిబంధన పాటించకపోతే దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం ఉంది.

ప్రయాణికులు తమ వీసా గడువులోగా అమెరికాను విడిచి వెళ్లినప్పుడు, వారి బాండ్ మొత్తాన్ని అధికారులు ఆటోమేటిక్‌గా తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం (ఓవర్‌స్టే), ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకోవడానికి ప్రయత్నించడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే, అధికారులు బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తారు. వీసా మినహాయింపు కార్యక్రమంలో ఉన్న దేశాల పౌరులకు ఈ కొత్త బాండ్ నిబంధన వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
US Visa
United States Visa
Visa Bond
B1 Visa
B2 Visa
USA Travel
Travel Restrictions
Visa Rules
Immigration
Department of Homeland Security

More Telugu News