Ravindra Jadeja: దారుణంగా విఫలమవుతున్న జడేజా... అశ్విన్ కీలక సూచన
- న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జడేజా
- బౌలింగ్ లో కొత్తగా ప్రయోగాలు చేయాలన్న అశ్విన్
- కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచన
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో, అతడి వన్డే కెరీర్ ముగింపు దశకు వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జడేజాపై అతని మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
జడేజాకు తనదైన బలాలు ఉన్నాయని అశ్విన్ చెప్పాడు. కానీ అదే పాత పంథాలో కొనసాగడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డాడు. కొత్తగా బౌలింగ్‌లో ప్రయోగాలు చేయాలని తాను ఎన్నిసార్లు సూచించినా జడేజా వినడంలేదని తెలిపాడు. బిషన్ సింగ్ బేడీ, మణీందర్ సింగ్, మిచెల్ శాంట్నర్ తరహాలో కొత్తగా ప్రయత్నించాలని చెప్పినప్పటికీ వినలేదని... అతడు తన సేఫ్ జోన్ నుంచి బయటకు రావడం లేదని పేర్కొన్నాడు.
కొత్తగా ప్రయత్నిస్తే విఫలం అవుతానన్న భయం జడేజాలో ఎక్కువగా ఉందని, కానీ మార్పులు చేయకపోయినా జట్టులో స్థానం ప్రమాదంలో పడుతుందన్నది గుర్తించాలన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ఫామ్ కోల్పోయిన సమయంలో కోహ్లీ తన ఆటను మార్చుకుని, ఒత్తిడి లేకుండా ఆడుతూ మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడని అశ్విన్ గుర్తు చేశాడు. జడేజా కూడా అలాంటి సానుకూల దృక్పథంతో ముందుకెళితేనే వన్డేల్లో తన స్థానం నిలబెట్టుకోగలడని వ్యాఖ్యానించాడు.