Donald Trump: ఫ్రాన్స్ షాంపేన్ పై 200 శాతం పన్ను.. ట్రంప్ తాజా వార్నింగ్

Donald Trump Warns France with 200 Percent Tax on Champagne
  • అమెరికా శాంతి మండలిలో చేరబోనన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
  • తన ఆహ్వానాన్ని తిరస్కరించడంపై ట్రంప్ సీరియస్
  • ఫ్రాన్స్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే షాంపేన్, వైన్ లపై భారీ సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. గాజా పునర్నిర్మాణం కోసం తాను ప్రతిపాదించిన శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్)లో చేరేందుకు విముఖత ప్రదర్శించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్రాన్స్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వైన్, షాంపేన్ లపై ఏకంగా 200 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే, టారిఫ్ లు విధిస్తానంటూ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగబోమని మాక్రాన్ స్పష్టం చేశారు.

మండలి నిబంధనలపై మాక్రాన్ అభ్యంతరం..
ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధంలో గాజా పూర్తిగా చితికిపోయిన విషయం తెలిసిందే. యుద్ధం జరుగుతున్న సమయంలోనే గాజా పునర్నిర్మాణ బాధ్యత తమదేనని ట్రంప్ ప్రకటించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించి ఇజ్రాయెల్ తో యుద్ధం విరమింపజేశారు. గతంలో చెప్పినట్లుగానే గాజా పునర్నిర్మాణం దిశగా ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శాంతి మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. అందులో చేరాలంటూ వివిధ దేశాలకు ఆహ్వానం పలికారు.

ఫ్రాన్స్ కు కూడా ఆహ్వానం పలకగా.. మాక్రాన్ సున్నితంగా తిరస్కరించారు. శాంతి మండలి నిబంధనలు గాజా ప్రాంతానికే పరిమితం కాదని, మండలి పరిధి విస్తృతంగా ఉందని మాక్రాన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి సూత్రాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందన్నారు. అందుకే ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు మాక్రాన్ వెల్లడించారు.

రష్యా, అర్జెంటీనా, భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాలను శాంతి మండలిలో చేర్పించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దావోస్‌లో జరగనున్న సదస్సులో దీనిపై సంతకాలు చేయించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం ఆశించే దేశాలు కనీసం 1 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాలని ట్రంప్ నిబంధన పెట్టారు.
Donald Trump
France
Emmanuel Macron
US Tariffs
Champagne
Wine
Gaza Reconstruction
Board of Peace
Trade War
International Relations

More Telugu News