PM Modi: ఇకపై నితిన్ నబినే నా బాస్.. నేను కార్యకర్తను మాత్ర‌మే: ప్రధాని మోదీ

I am party worker and Nitin Nabin is my boss says PM Modi
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ నితిన్ నబిన్ 
  • పార్టీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా గుర్తింపు
  • నూతన అధ్యక్షుడిని అభినందించిన మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
  • వికసిత భారత్ లక్ష్య సాధనలో నబిన్ నాయకత్వం కీలకమన్న ప్రధాని
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (46) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. "ఇకపై పార్టీ వ్యవహారాల్లో నితిన్ నబిన్ నా బాస్, నేను ఒక సాధారణ కార్యకర్తను మాత్ర‌మే" అని మోదీ పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'సంఘటన్ పర్వ్' కార్యక్రమంలో నితిన్ నబిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నూతన అధ్యక్షుడిని సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలు జరిగాయని తెలిపారు. "ప్రభుత్వ అధినేతగా నాకు ఎంత అనుభవం ఉన్నా, అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఈ విషయంలో గర్వపడతాను" అని మోదీ అన్నారు. "వికసిత భారత్ నిర్మాణానికి రానున్న 25 ఏళ్లు చాలా కీలకం. ఈ ముఖ్యమైన సమయంలో నితిన్ నబిన్ పార్టీని ముందుకు నడిపిస్తారు. ఆయన ఒక మిలీనియల్ (జనరేషన్ వై... జెన్ జెడ్ కు ముందు తరం), యువ శక్తితో పాటు సంస్థాగత అనుభవం కూడా ఉంది" అని ప్రధాని ప్రశంసించారు.

అటల్ జీ, అద్వానీజీ నుంచి జేపీ నడ్డా వరకు పార్టీ అధ్యక్షులుగా చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. నాయకులు మారినా పార్టీ సిద్ధాంతాలు, దిశ మారవని స్పష్టం చేశారు. అనంతరం మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన యువకుడైన నితిన్ నబిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చరిత్రాత్మకమని అన్నారు. పార్టీకి మార్గనిర్దేశం చేసిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒక్కరే నామినేషన్ వేయడంతో బీజేపీ జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్ నితిన్ నబిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
PM Modi
Nitin Nabin
BJP
Narendra Modi
BJP National President
Amit Shah
JP Nadda
Indian Politics
Bharatiya Janata Party
Delhi
Sangathan Parv

More Telugu News