Rashmi Gautam: మూగజీవాల పట్ల హింస తగదంటూ యాంకర్ రష్మి కీలక వ్యాఖ్యలు

Rashmi Gautam Condemns Violence Against Street Dogs
  • ఇవ్వాళ నోరులేని జీవాలు, రేపు అమ్మానాన్నలనూ అడ్డుతొలగించుకుంటారా? అంటూ మండిపాటు
  • వీధి కుక్కల విషయంలో అసలు సమస్యను గుర్తించాలని సూచన
  • జంతువులు కూడా పకృతిలో భాగమేనని వ్యాఖ్య
‘‘అడ్డుగా ఉన్నాయని ఇవ్వాళ మూగ జీవాలను చంపేస్తున్నాం.. రేపు ముసలి వాళ్లయ్యారు, అడ్డుగా ఉన్నారని అమ్మానాన్నలను కూడా వదిలించుకుంటామా..’’ అంటూ యాంకర్ రష్మి గౌతమ్ ప్రశ్నించారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న హింసను ఆమె ఖండించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రష్మి మాట్లాడారు. జంతువుల పట్ల మానవత్వం ప్రదర్శించాలని కోరారు.

రుచి కోసం మూగజీవాలను చంపి తింటున్నామని, దూడలకు అందాల్సిన జున్ను పాలను కూడా పిండుకుని తాగేస్తున్నామని, ఇప్పుడు కుక్కలు కరుస్తున్నాయని వందలాది వీధి కుక్కలను అమానుషంగా చంపేస్తున్నామని వాపోయారు. ఇటీవల తెలంగాణలోని రెండు గ్రామాల్లో వందలాది కుక్కలను విషపు ఇంజెక్షన్లతో చంపేయడంపై రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు మనుషులను కరుస్తున్నాయన్న కారణాలతో వాటిని చంపాలని చూడటం సరికాదన్నారు. అసలు సమస్యను గుర్తించే ప్రయత్నం చేయాలని కోరారు.

మీడియా కూడా కేవలం కుక్కల వల్ల జరిగే ప్రమాదాలనే హైలైట్ చేస్తోందని, కానీ వాటికి ఎదురవుతున్న కష్టాలను చూపడంలేదని రష్మి మండిపడ్డారు. జంతువులు కూడా ప్రకృతిలో భాగమేననే విషయాన్ని గుర్తించాలన్నారు. పూర్వం అన్నం వండాక మొదటి ముద్ద ఆవుకు, కుక్కకు పెట్టే సంప్రదాయం ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేవలం బట్టల మీద పడి కొట్టుకుంటున్నామని అంటూ, మహిళల వస్త్రధారణపై ఇటీవల జరిగిన వివాదాన్ని రష్మి పరోక్షంగా ప్రస్తావించారు. సంస్కృతి అంటే కేవలం వేసుకునే దుస్తులు మాత్రమే కాదు.. తోటి జీవుల పట్ల చూపే కరుణ కూడా అని రష్మి వ్యాఖ్యానించారు.
Rashmi Gautam
Rashmi Gautam comments
animal cruelty
street dogs
dog culling
animal rights
Hyderabad press club
Telangana
compassion towards animals
stray dogs

More Telugu News