Ramachandra Rao: ఆఫీసులోనే రాసలీలలు.. రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావును సస్పెండ్ చేసిన కర్ణాటక ప్రభుత్వం

Karnataka Suspends DGP Ramachandra Rao Following Misconduct Claims
  • కార్యాలయంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోల వైరల్
  • ఇవి మార్ఫింగ్ చేసిన వీడియోలని ఆరోపణలను ఖండించిన అధికారి
  • ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య
  • గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్న రామచంద్రరావు
తన కార్యాలయంలోనే పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (DCRE) డీజీపీ డాక్టర్ కె. రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సిబ్బంది, పరిపాలన సంస్కరణల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రవర్తన ప్రభుత్వ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ఉందని, ప్రభుత్వ ఉద్యోగికి తగనిదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రామచంద్రరావు తన కార్యాలయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో, పలు న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

“ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ప్రవర్తన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు-1968లోని రూల్ 3ను ఉల్లంఘించడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం. అందుకే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను తక్షణమే సస్పెన్షన్‌లో ఉంచుతున్నాం” అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లిస్తామని, ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది.

వైరల్ అయిన వీడియో క్లిప్పులలో రామచంద్రరావు తన అధికారిక ఛాంబర్‌లో యూనిఫాంలో ఉండగా మహిళను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. మరో వీడియోలో సూట్‌లో ఉండగా, జాతీయ జెండా, పోలీస్ శాఖ చిహ్నం ముందు అదే తరహా ప్రవర్తన కనబరిచారు. 

ఆరోపణలను ఖండించిన అధికారి
ఈ వివాదంపై రామచంద్రరావు స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలని, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తెలిపారు. ఈ విషయంపై తన న్యాయవాదితో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఆయన హోంమంత్రి జి. పరమేశ్వర కార్యాలయానికి వెళ్లగా, ఆయన్ను కలిసేందుకు మంత్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హోం శాఖ నుంచి నివేదిక కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, విచారణ జరిపి అవసరమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గతంలోనూ వివాదాలు
రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది మార్చిలో ఆయన సవతి కుమార్తె, నటి రాన్యా రావు పేరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో వినిపించింది. తన తండ్రి పేరు, హోదాను అడ్డం పెట్టుకుని ఆమె భద్రతా తనిఖీల నుంచి తప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం రామచంద్రరావును నిర్బంధ సెలవుపై పంపింది. ఇటీవలే ఆయన తిరిగి విధుల్లో చేరగా, ఇప్పుడు ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
Ramachandra Rao
Karnataka
DGP
Suspension
IPS officer
Civil Rights Enforcement
Allegations
Controversy
Viral Video
G Parameshwara

More Telugu News