Naresh: 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంపై నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Naresh Comments on Nari Nari Naduma Murari Movie Success
  • ‘శుభకృత్ నామ సంవత్సరం’ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు నరేశ్
  • తన సినిమాకి తనకే టికెట్లు దొరకని పరిస్థితి జీవితంలో తొలిసారి అన్న నరేశ్
  • సింగిల్ థియేటర్‌లో టికెట్ దొరక్క మల్టీ ప్లెక్స్ లో బుక్ చేసుకుని చూశామని వెల్లడి 
సంక్రాంతి 2026 బరిలో నిలిచిన చిత్రాల్లో ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నట్టు వార్తలొస్తున్నాయి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. తాజాగా నటుడు నరేశ్ విజయ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టం చేశాయి.

ఎస్‌ఎస్‌ సజ్జన్ దర్శకత్వంలో నరేశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘శుభకృత్ నామ సంవత్సరం’ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేశ్, ‘నారీ నారీ నడుమ మురారి’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గోవాలో షూటింగ్ పూర్తిచేసుకుని నిన్నే వచ్చామని, పవిత్రతో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమా చూడాలని అనుకున్నామన్నారు. అయితే మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్‌లోనే చూద్దాం అనుకున్నామని, కానీ సింగిల్ థియేటర్‌లో టికెట్లు దొరకలేదన్నారు. తన సినిమాకి తనకే టికెట్లు దొరకని పరిస్థితి తన జీవితంలో ఇదే తొలిసారి అని, నిజంగా తాను షాక్ అయ్యానన్నారు.

చివరికి ఆర్కే కాంప్లెక్స్‌లో బుక్ చేయించామని, మల్టీప్లెక్స్ కాబట్టి పెద్దగా సందడి ఉండదనుకున్నా కానీ ఈలలు, కేకలతో థియేటర్ మొత్తం ఊగిపోయిందన్నారు. ఇలాంటి స్పందనను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది చూసి చాలా సంతోషంగా అనిపించిందని నరేశ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో ఈవెంట్‌లో నవ్వుల సందడి నెలకొంది. నరేశ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ ‘ఇదే నిజమైన బ్లాక్‌బస్టర్ క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
Naresh
Nari Nari Naduma Murari
Sharwanand
SS Sajjan
Subhakruth Nama Samvatsaram
Pavitra
Telugu Movie
Sankranti 2026
Movie Tickets
Blockbuster

More Telugu News