KTR: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

KTR Letter to Giriraj Singh on Sircilla Power Loom Cluster Delay
  • సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్
  • క్లస్టర్ కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని వెల్లడి
  • తెలంగాణ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయ లాంటిదన్న కేటీఆర్

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణపై ఉద్దేశపూర్వక వివక్షేనని లేఖలో ఆయన ఆరోపించారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, దీనిపై పదేళ్లుగా నిరంతరం పోరాడుతున్నామని గుర్తు చేశారు. కేంద్ర బృందాలే అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించినా ఫైళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించారు.


సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ లాంటిదని, ఈ ప్రాంతం 30 వేలకు పైగా పవర్ లూమ్స్‌తో వేలాది కుటుంబాల జీవనాధారమని కేటీఆర్ తెలిపారు. తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాంతాలకు క్లస్టర్లు ఇచ్చి, సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన భూమి, విద్యుత్, నీరు, అనుమతులు అన్నీ సిద్ధం చేసిందని గుర్తుచేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదాలు ఇచ్చే కేంద్రం, నిజంగా సామర్థ్యం ఉన్న సిరిసిల్లకు మద్దతు ఇవ్వకపోవడం ద్వంద్వ నీతేనన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించి పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR
KT Rama Rao
Giriraj Singh
Sircilla
Mega Power Loom Cluster
Telangana textiles
Power looms
Textile industry
Make in India
Central government

More Telugu News