Deepak U: బస్సులో అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్ కావడంతో వ్యక్తి బలవన్మరణం

Kerala Man Deepak U Dies by Suicide After Viral Molestation Video
  • బస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలతో వీడియో వైరల్
  • తీవ్ర మనస్తాపంతో కోజికోడ్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్య
  • సోషల్ మీడియా విచారణ వల్లే మరణించాడని బంధువుల ఆరోపణ
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
  • వీడియో సర్క్యులేషన్‌పై కూడా దర్యాప్తు జరుపుతామన్న అధికారులు
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒక మహిళ పోస్ట్ చేసిన వీడియో కారణంగా, తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటుచేసుకుంది.

కోజికోడ్‌లోని గోవిందపురం నివాసి దీపక్ యు (42) ఒక టెక్స్‌టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ప్రయాణిస్తుండగా ఒక ప్రయాణికురాలు తన పట్ల దీపక్ లైంగిక ఉద్దేశంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.

ఈ ఘటన తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన దీపక్ తనపై వచ్చిన ఆరోపణలను కుటుంబ సభ్యుల వద్ద ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్ల ఆయన తీవ్రంగా కుంగిపోయారు. ఈ క్రమంలో జనవరి 18న ఆదివారం ఉదయం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు గది తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు.

సమాచారం అందుకున్న కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో జరిగిన విచారణ (సోషల్ మీడియా ట్రయల్) కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి దారితీసిన పరిస్థితులతో పాటు, వీడియో సర్క్యులేషన్ వ్యవహారంపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. మరోవైపు, తాను ఈ ఘటనపై వడకర పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీపక్ ఉద్దేశపూర్వకంగానే తనను తాకాడని నమ్మి వీడియో పోస్ట్ చేశానని సదరు మహిళ మరో వీడియోలో పేర్కొన్నారు.
Deepak U
Kerala
Kozhikode
suicide
social media
viral video
molestation accusation
KSRTC bus
cyberbullying
social media trial

More Telugu News