KTR: ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..?: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR Fires on CM Revanth Reddy Over Remarks on BRS Flags
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం
  • బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలన్నారంటూ తీవ్ర ఆగ్రహం
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం వ్యాఖ్యలున్నాయని ఆరోపణ
  • సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేసిన కేటీఆర్
  • పాత బాస్ ఆదేశాలతోనే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటూ సీఎం మాట్లాడడం ఏంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. "ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా?" అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మరిచి, అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడటం ద్వారా సీఎం తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాకు ఉన్న స్థానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయినట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు మతిభ్రమించిందని, ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. 

సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే కేసులు పెట్టి అరెస్టులు చేసే పోలీసు శాఖ, ఇప్పుడు నేరుగా హింసను ప్రేరేపించేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి, సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తన పాత బాస్ ఆదేశాల మేరకే తెలంగాణ జలహక్కులను కాలరాశారని, నేటి వ్యాఖ్యలతో ఆయన నిజస్వరూపం బట్టబయలైందని అన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, దాని నుంచి బయటకు దూకేందుకు రేవంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. 

ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు టీడీపీని రాష్ట్రంపై రుద్దే ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
BRS
Telangana
Congress
TDP
Telangana Politics
BRS Flags
Chief Minister

More Telugu News