T20 World Cup 2026: భారత్‌లో ఆడ‌లేమంటూ ఐసీసీకి బంగ్లా కొత్త ప్రతిపాదన.. ఐర్లాండ్ అభ్యంతరం

Ireland End Debate After Bangladeshs Request To ICC Over T20 World Cup Row
  • టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు రాబోమంటున్న బంగ్లాదేశ్
  • తమ గ్రూపును ఐర్లాండ్‌తో మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి
  • భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయమని బీసీబీ వెల్లడి
  • షెడ్యూల్‌లో మార్పులుండవని స్పష్టం చేసిన క్రికెట్ ఐర్లాండ్
2026 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. భారత్‌లో ఆడేందుకు ససేమిరా అంటున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఈ మేరకు ఐసీసీ ముందు ఓ సరికొత్త ప్రతిపాదన ఉంచింది. తమ గ్రూపును ఐర్లాండ్‌తో పరస్పరం మార్చుకోవాలని, తద్వారా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడే అవకాశం కల్పించాలని నిన్న‌ జరిగిన సమావేశంలో బీసీబీ కోరింది.

అయితే, బంగ్లాదేశ్ ప్రతిపాదనకు క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమకు కేటాయించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని ఐసీసీ నుంచి స్పష్టమైన హామీ లభించిందని సీఐ పేర్కొంది. "మేం కచ్చితంగా శ్రీలంకలోనే మా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడతాం. మా షెడ్యూల్‌ను మార్చబోమని మాకు హామీ ఇచ్చారు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో సీఐ అధికారి తెలిపారు.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్-సీలో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి ఉంది. ఈ జట్టు తమ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. మరోవైపు ఐర్లాండ్ జట్టు గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌తో పాటు ఉంది. ఈ గ్రూప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.

టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని బీసీబీ గతంలోనే ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్‌లో తమ జట్టు ఆటగాళ్లు, అభిమానులు, మీడియా భద్రతపై ఆందోళనగా ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు బీసీబీ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే గ్రూపుల మార్పిడి అంశం చర్చకు వచ్చినట్లు బీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఐర్లాండ్ తాజా ప్రకటనతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది.
T20 World Cup 2026
Bangladesh Cricket Board
BCB
ICC
Ireland Cricket
Sri Lanka
India
Cricket Ireland
T20 World Cup schedule

More Telugu News