Sudha Murthy: దేశ విభజనతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లిన వారి గురించి ఆలోచిస్తే బాధగా ఉంటుంది: సుధామూర్తి

Sudha Murthy Feels Sad About People Who Migrated After Partition
  • దేశ విభజన జరగడం తప్పని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్న సుధామూర్తి
  • దేశ చరిత్రను నేటి తరం పిల్లలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని వ్యాఖ్య
  • చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్థం చేసుకోవడం కష్టమన్న సుధామూర్తి
దేశ విభజన అనంతరం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వలస వెళ్లిన వారి గురించి ఆలోచిస్తే ఎంతో బాధ కలుగుతుందని రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. దేశ విభజన జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు. జైపూర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న సుధామూర్తి మాట్లాడుతూ, దేశ చరిత్రను, ముఖ్యంగా విభజనకు దారితీసిన పరిస్థితులను నేటి తరం పిల్లలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని సూచించారు.

చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్థం చేసుకోవడం కష్టమని ఆమె అన్నారు. దేశ విభజన నాటి పరిస్థితులను నేటి తరానికి తెలియజేయాలని చాలాసార్లు అనుకున్నానని ఆమె పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయం, భాషల గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తి పెన్సిల్ తీసుకుని గీత గీసి సరిహద్దుల నిర్ణయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విభజన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వలస వెళ్లిన వారి గురించి ఆలోచిస్తే బాధగా ఉందని ఆమె అన్నారు.

ఒకసారి తాను పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు విదేశీయురాలినని చెప్పి అక్కడి మ్యూజియంలో అధిక ఛార్జ్ వసూలు చేశారని, కానీ ఆ భూభూగం ఒకప్పుడు మన దేశంలో భాగమేనని గుర్తు చేశారు. సరిహద్దుల కారణంగా అది విదేశమైందన్న ఆలోచన తనను ఎంతగానో బాధించిందని ఆమె తెలిపారు. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ మన పూర్వీకులు ఎంతో కష్టపడి సాధించారని ఆమె పేర్కొన్నారు. దేశ విభజన కోసం ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఎన్నో తరాలపై ప్రభావం చూపుతోందని ఆమె అన్నారు.
Sudha Murthy
India partition
Pakistan
Bangladesh
Jaipur Literature Festival
Indian history
borders

More Telugu News