Sharwanand: ఎంతో ఎదురుచూస్తున్న పెద్ద హిట్‌ను ఈ సినిమా ఇచ్చింది: శర్వానంద్
- ప్రేక్షకులను ఆకట్టుకున్న 'నారీ నారీ నడుమ మురారి'
- మంచి కంటెంట్ ఉంటే విడుదల తేదీ ప్రభావం ఉండదన్న శర్వానంద్
- తనకు సంక్రాంతి కలిసొస్తుందని వ్యాఖ్య
సంక్రాంతి రేసులో కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా, బలమైన మౌత్ టాక్‌తో శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం, స్వచ్ఛమైన కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. మొదట పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ, రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ తో స్క్రీన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి సక్సెస్ మూవీగా నిలిచింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెద్ద హిట్‌ను ఈ సినిమా ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మంచి కంటెంట్ ఉంటే విడుదల తేదీ ప్రభావం ఉండదని ఈ సినిమా నిరూపించిందన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు పనితీరును ప్రశంసించిన ఆయన, నరేశ్ పాత్రకు వస్తున్న స్పందన ప్రత్యేకమని తెలిపారు. సంక్రాంతి సీజన్ తనకు కలిసొస్తుందని అన్నారు. ఇకపై ప్రతి సంక్రాంతికి ఒక సినిమా స్లాట్ రిజర్వ్ చేసుకోవాలని నవ్వుతూ అన్నారు.
నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పండుగ చివర్లో విడుదల కావడంతో స్క్రీన్లు తక్కువగా దొరికాయని... ఇప్పుడు థియేటర్లు పెరిగుతున్నాయని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ సినిమాలో సంయుక్త మేనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించగా... నరేశ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.