Imtiaz Jaleel: మహారాష్ట్రలో సత్తా చాటిన మజ్లిస్.. ఛత్రపతి శంభాజీనగర్, మాలేగావ్‌లలో అత్యధిక స్థానాల్లో గెలుపు

Majlis Party Wins Big in Maharashtra Municipal Elections Translation
  • ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 33 స్థానాలు గెలిచిన మజ్లిస్ పార్టీ
  • మాలేగావ్‌లో 20 స్థానాలతో అగ్రస్థానంలో మజ్లిస్
  • రాష్ట్ర వ్యాప్తంగా 126 స్థానాల్లో గెలిచిన మజ్లిస్ పార్టీ
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన సత్తా చాటింది. ఒకప్పుడు ఈ పార్టీ హైదరాబాద్‌కు, అందులోనూ పాతబస్తీకే పరిమితమని భావించేవారు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పోటీ చేసి కొన్ని శాసన సభ స్థానాలను కూడా గెలుచుకుంది.

తాజాగా మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛత్రపతి శంభాజీనగర్, మాలేగావ్ కార్పొరేషన్‌లలో మజ్లిస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది.

ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మజ్లిస్ పార్టీ రెండో స్థానంలో నిలువగా, మాలేగావ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. శంభాజీనగర్‌లో పార్టీలో తలెత్తిన అసమ్మతి, తిరుగుబాట్లు, విమర్శలను అధిగమించి మజ్లిస్ పార్టీ 33 సీట్లు గెలుచుకుంది. 2015లో ఇక్కడ 24 సీట్లు గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్యను పెంచుకుంది.

మాలేగావ్‌లో మొత్తం 84 వార్డులు ఉండగా, మజ్లిస్ పార్టీ 20 స్థానాల్లో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది. బీజేపీ 18 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక్కడ ఇతరులు 35 స్థానాల్లో విజయం సాధించారు.

ఈ ఫలితాలపై మహారాష్ట్ర మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్పందిస్తూ, మజ్లిస్ పార్టీ ఒక వర్గానికి చెందినదని భావించేవారికి ఈ ఫలితాలు గుణపాఠం అన్నారు. మజ్లిస్ పార్టీ కేవలం ముస్లింలకు చెందిన పార్టీ అనే వాదనను ఈ ఫలితాలు తప్పని నిరూపించాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు సహా హిందువులు కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.
Imtiaz Jaleel
AIMIM
Maharashtra local body elections
Chhatrapati Sambhajinagar
Malegaon
Maharashtra municipal corporation election results

More Telugu News