Iran Protests: అట్టుడుకుతున్న ఇరాన్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

Iran Protests Indians Safely Return Home
  • అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు
  • క్షేమంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బాధితులు
  • ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని వెల్లడి
  • పౌరులంతా తిరిగి రావాలన్న భారత విదేశాంగ శాఖ 
  • ఇరాన్‌లో దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నట్లు ప్రభుత్వ అంచనా
అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి పలువురు భారత పౌరులు క్షేమంగా స్వదేశానికి తిరిగివచ్చారు. భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు వారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం కారణంగా గత డిసెంబర్ చివరి నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితి క్షీణించడం, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అక్కడ ఉన్న భారతీయుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాయి. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వెంటనే దేశం విడిచి రావాలని సూచించాయి.

స్వదేశానికి తిరిగొచ్చిన ఒకరు మీడియాతో మాట్లాడుతూ "అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి. మోదీజీ ఉంటే ఏదైనా సాధ్యమే" అని అన్నారు. మరొకరు మాట్లాడుతూ "ఇంటర్నెట్ లేకపోవడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయాం. బయటకు వెళ్తే నిరసనకారులు అడ్డుకునేవారు" అని అక్కడి ఇబ్బందులను వివరించారు.

విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ప్రకారం ఇరాన్‌లో విద్యార్థులు సహా సుమారు 9,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం వాణిజ్య విమానాల ద్వారా పౌరుల తరలింపును సులభతరం చేస్తూ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Iran Protests
Iran
Indians in Iran
Narendra Modi
Indian Embassy Tehran
Randhir Jaiswal
Economic Crisis Iran
Indians Return
Tehran
India

More Telugu News