Online Betting: 242 వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం... కారణం ఇదే!

Online Betting 242 Betting Websites Blocked by Central Government
  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూదం కారణంగా యువత వ్యసనాలకు బానిసలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని గుర్తించిన కేంద్రం 
  • కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను తీసుకువచ్చిన వైనం
  • బెట్టింగ్‌, జూదాన్ని ప్రోత్సహిస్తున్న దాదాపు 8 వేల వెబ్‌సైట్లపైనా చర్యలు తీసుకున్నామన్న కేంద్రం
అక్రమ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ జూదంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. యువతను తప్పుదోవ పట్టిస్తూ సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 242 బెట్టింగ్‌, జూదం వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతే కాకుండా ఇప్పటి వరకు బెట్టింగ్‌, జూదాన్ని ప్రోత్సహిస్తున్న దాదాపు 8 వేల వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూదం కారణంగా యువత వ్యసనాలకు బానిసలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్రం గుర్తించింది. కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ఆర్థికంగా చితికిపోవడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం సమాజానికి తీవ్ర ముప్పుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాక్ట్‌ 2023ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా నగదుతో ముడిపడిన గేమ్స్‌పై నిషేధం, రియల్‌ మనీ గేమ్స్‌పై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంతో వింజో, నజారా టెక్నాలజీస్‌ వంటి ప్రముఖ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వేదికలు కూడా రియల్‌ మనీ గేమ్స్‌ను నిలిపివేశాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఆధ్వర్యంలో దేశీయంగానే కాకుండా విదేశీ సర్వర్ల నుంచి పనిచేస్తున్న అక్రమ బెట్టింగ్‌ వేదికలను గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లపై నిఘా పెట్టి ఇప్పటి వరకు దాదాపు 8 వేల సైట్లపై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 
Online Betting
Betting websites
Online Gambling
Gaming Act 2025
Real Money Games
Winzo
Nazara Technologies
Cyber Crime

More Telugu News