Birendra Kumar Dey: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మరో దాడి.. ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు

Birendra Kumar Dey Hindu Teachers House Set Ablaze in Bangladesh
  • సిల్హెట్ జిల్లాలోని గోవైన్‌ఘాట్‌లో ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు
  • మరో హిందూ కుటుంబంపై దాడి జరిగిందని స్థానిక మీడియా వెల్లడి
  • భయాందోళనకు గురైన సమీపంలోని మైనారిటీ కుటుంబాలు
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హెట్ జిల్లాలోని గోవైన్‌ఘాట్‌లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనారిటీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఉపాధ్యాయుడి కుటుంబం ఆ ఇంటి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బంది పడింది.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ కుటుంబంపై దాడి జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. గోవైన్‌ఘాట్ ఉపజిల్లా పరిధిలోని నందిర్‌గావ్ యూనియన్‌లో గల బహోర్ గ్రామంలో ఒక ఇస్లామిక్ గ్రూపు పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పంటించిందని కథనాలు పేర్కొన్నాయి.

ఈ వారం ప్రారంభంలో, ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాలో మరొక హిందూ వ్యక్తిని ఛాందసవాదులు కత్తితో పొడిచి చంపారని స్థానిక మీడియా తెలిపింది. జగత్‌పూర్ గ్రామంలో సోమవారం 27 ఏళ్ల ఆటో డ్రైవర్ సమీర్ దాస్ మృతదేహాన్ని ఒక వ్యవసాయ క్షేత్రం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

గడిచిన 24 రోజుల్లో బంగ్లాదేశ్‌లో ఇది తొమ్మిదవ ఘటన. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హిందూ మైనారిటీలపై హింస పెరుగుతుండటంపై ప్రపంచ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Birendra Kumar Dey
Bangladesh Hindu attack
Hindu teacher attack
Gowainghat
Minority attack Bangladesh

More Telugu News