KTR: వాళ్లను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు: కేటీఆర్

KTR Comments on Telangana MLA Defections
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వెనకేసుకువస్తోందని కేటీఆర్ విమర్శ
  • స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపణ
  • ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందన్న కేటీఆర్
  • ప్రజాతీర్పును అవమానించిన వారిపై పోరాటం ఆగదని స్పష్టీకరణ
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటుకుందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కళ్ల ముందే పార్టీ మారిన కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఎలాంటి ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైన గానీ, అత్యున్నత న్యాయస్థానాలపైన గానీ గౌరవం లేదని ఈ పరిణామాలతో మరోసారి స్పష్టమైందని అన్నారు.

ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారని, అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లాలంటే అధికార పార్టీ వణికిపోతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ భయంతోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ విఫలయత్నాలు చేస్తోందని విమర్శించారు. గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశాయని మండిపడ్డారు.

గోడ దూకిన ఎమ్మెల్యేలు ప్రజాకోర్టులో ఎప్పుడో 'మాజీ'లు అయిపోయారనే నిజాన్ని కాంగ్రెస్ గుర్తించకపోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారికి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR
KTR Telangana
Revanth Reddy
BRS
Congress
Telangana Politics
MLA Defection
Pocharam Srinivas Reddy
Kaleru Yadaiah
Telangana Assembly

More Telugu News