Chandrababu Naidu: కేరళలో పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో పడవల పోటీలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu on Atreyapuram Boat Races resembling Kerala
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్
  • ప్రకృతిని ప్రేమించి, పశు సంపదను పూజించే పండుగ సంక్రాంతి అన్న ముఖ్యమంత్రి
  • ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లాలో పండుగ వాతావరణం ఉందన్న చంద్రబాబు
  • 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 2026లో ఆకాంక్షలు నెరవేరుద్దామన్న ముఖ్యమంత్రి
సంక్రాంతి పర్వదినం సందర్భంగా, కేరళలో జరిగే పడవ పోటీలను తలపించే విధంగా ఆత్రేయపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతోందని, దీనిని రాష్ట్ర పండుగగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

గ్రామానికి రాగానే చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయని అన్నారు. మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతే జాతి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమించి, పశు సంపదను పూజించే పండుగ ఈ సంక్రాంతి అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని అన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. ప్రతి జిల్లాలో ఆనందంగా ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు.

ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూళ్లురుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వంటివి జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో వెళ్లిన వారికి ఎక్కడా గుంతలు పడిన రోడ్లు కనిపించడంలేదని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామాల అభివద్ధికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. 2025లో ప్రజల అవసరాలను తీర్చామని, ఈ సంవత్సరం వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పని చేయాలని అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలనకు ప్రభుత్వం నాంది పలికిందని అన్నారు.

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌'తో 'స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డెలివరింగ్' విధానం వైపు ప్రభుత్వం వెళుతోందని అన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఈ సంవత్సరం 42 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.10 వేల కోట్లను చెల్లించినట్లు చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని, ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు చెప్పారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడులలో 25 శాతం మన రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ఆనందమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించామని అన్నారు.

పార్టీ పరంగా పార్లమెంట్ స్థాయి వరకు పదవులను భర్తీ చేశామని, త్వరలోనే రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామని అన్నారు. కూటమి ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Sankranti festival
Atreyapuram boat races
Jaggannathota Prabhalu festival

More Telugu News