Oxford Economics: ఏఐ వల్లే ఉద్యోగాలు పోతున్నాయా?.. ఆక్స్‌ఫర్డ్ నివేదికలో ఆసక్తికర నిజాలు!

Oxford Economics Report on AI Impact on Job Losses
  • ఉద్యోగాల కోతకు ఏఐ ప్రధాన కారణం కాదన్న ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్
  • టెక్‌ రంగంలో 80 శాతం లేఆఫ్స్‌కు ఆర్థిక పరిస్థితులే కారణమని స్పష్టీకరణ
  • ఐటీ పనుల్లో 40 శాతం ఏఐ టూల్స్ వాడుతున్నట్టు నాస్కామ్ నివేదిక
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను మింగేస్తుందన్న ఆందోళనలపై 'ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్' కీలక వివరణ ఇచ్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమేనని, అసలు కారణాలు వేరే ఉన్నాయని స్పష్టం చేసింది. అమెరికాలో గత ఏడాది జరిగిన 1.25 లక్షల టెక్‌ ఉద్యోగాల కోతలో ఏఐ పాత్ర కేవలం 4.5 శాతమేనని తన నివేదికలో వెల్లడించింది.

ఉద్యోగాల తొలగింపునకు ఏఐ కంటే మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమనమే 80 శాతం మేర కారణమని నివేదిక పేర్కొంది. కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ఏఐ కారణం కాదని, మార్కెట్ అవసరాలకు తగ్గ డిజిటల్ నైపుణ్యాలు వారిలో లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని విశ్లేషించింది. ప్రస్తుతానికి ఉద్యోగాలను పూర్తిగా తుడిచిపెట్టే స్థాయికి ఏఐ ఇంకా ఎదగలేదని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ భరోసా ఇచ్చింది.

మరోవైపు, భారతీయ ఐటీ రంగంపై ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని 'నాస్కామ్-ఇండీడ్' నివేదిక వెల్లడించింది. ఐటీ కంపెనీల్లో దాదాపు 20 నుంచి 40 శాతం పనులు ప్రస్తుతం ఏఐ టూల్స్ ద్వారానే సాగుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 40 శాతానికి పైగా పనులు ఏఐ సహాయంతోనే జరుగుతున్నాయి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ద్వారా 37 నుంచి 39 శాతం పనులు ఏఐ ద్వారా జరుగుతున్నాయి.

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడటం కంటే, సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంచుకోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ అనేది మనిషికి ప్రత్యామ్నాయం కాదని, మనిషి చేసే పనిని వేగవంతం చేసే ఒక శక్తివంతమైన సాధనం మాత్రమేనని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Oxford Economics
AI
artificial intelligence
job losses
tech industry
NASSCOM
Indeed
IT sector
digital skills
automation

More Telugu News