Chandrababu Naidu: సార్లంకపల్లె అగ్నిప్రమాదం: బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా... తక్షణ సాయం, పక్కా ఇళ్లు

Chandrababu Naidu assures assistance to Sarlankapalle fire victims
  • కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, 26 గుడిసెలు దగ్ధం
  • నిరాశ్రయులైన 33 గిరిజన కుటుంబాలు
  • బాధితులకు రూ. 25 వేల తక్షణ సాయం ప్రకటించిన సీఎం
  • ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశం
  • గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 నగదు అందించాలని, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ సాయంపై భరోసా ఇచ్చారు.

తహసీల్దార్ ఎస్‌వీ నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందించే పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Chandrababu Naidu
Sarlankapalle fire accident
Kakinada district
Routhulapudi mandal
Tribal families
House fire compensation
Andhra Pradesh government
Varupula Satya Prabha
Thangalla Uday Srinivas

More Telugu News