Upendra Dwivedi: 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్‌ను కచ్చితత్వంతో అమలు చేశాం: ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది

Upendra Dwivedi Operation Sindoor executed with precision
  • భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సైనిక సంసిద్ధత సిందూర్ ద్వారా స్పష్టమైందని వెల్లడి
  • ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశామన్న ఆర్మీ చీఫ్
  • దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్ సిందూర్‌ను అత్యంత కచ్చితత్వంతో అమలు చేశామని, 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో మన సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఇది త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్ధత దీని ద్వారా స్పష్టమైందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని పేర్కొన్నారు. 

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశామని ఆయన వివరించారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించినట్లు చెప్పారు. పాకిస్థాన్ చిన్న పొరపాటు చేసినా భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా అప్పుడు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్య సరిహద్దులో పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు.

ఈశాన్య సరిహద్దులు స్థిరంగానే ఉన్నాయని, అయితే అప్రమత్తంగా ఉండటం కీలకమని వెల్లడించారు. చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆయన మాట్లాడుతూ, భారత బలగాలు బలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులు సున్నితంగా ఉన్నప్పటికీ, నియంత్రణలోనే ఉన్నాయని ఆయన అన్నారు.
Upendra Dwivedi
Operation Sindoor
Indian Army
Army Chief
Jammu Kashmir
China Border
Terrorist Camps

More Telugu News