Donald Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అమెరికా ‘టారిఫ్’ వాత: ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Warns Tariffs on Countries Trading With Iran
  • ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలున్న దేశాలపై 25 శాతం అదనపు సుంకం
  • భారత్, చైనా సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
  • ఇరాన్ నిరసనల్లో 648 మంది మృతి
  • సైనిక చర్యకు సిద్ధమని ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం అదనపు టారిఫ్ (సుంకం) చెల్లించాల్సి ఉంటుందని సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీసేలా ఉంది. ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్న భారత్, చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. "ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి.. ఇవి అంతిమమైనవి" అని తన 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, మానవతా దృక్పథంతో చేసే వాణిజ్యానికి ఏవైనా మినహాయింపులు ఉంటాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు ఇరాన్‌లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళనల్లో భద్రతా దళాల కాల్పుల వల్ల సుమారు 648 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నార్వేకు చెందిన హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. దీనిపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందిస్తూ.. ఇరాన్ నాయకత్వం 'రెడ్ లైన్' దాటిందని, వారిపై నేరుగా సైనిక చర్య చేపట్టాలని ట్రంప్‌ను కోరారు.

ఒకవైపు హెచ్చరికలు కొనసాగుతున్నా, సమస్య పరిష్కారానికి దౌత్యమే తమ మొదటి ప్రాధాన్యతని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఇరాన్ అధికారులు చర్చల కోసం సంప్రదిస్తున్నారని, ప్రతిపక్ష నేతలతో కూడా తాము టచ్‌లో ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ కూడా అమెరికాతో కమ్యూనికేషన్ ఛానెల్స్ ఇంకా తెరిచే ఉన్నాయని, తాము ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
Donald Trump
Iran
Iran trade
US tariffs
trade war
China
India
Turkey
UAE
human rights

More Telugu News