Jagan Mohan Reddy: యువత దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది: జగన్
- నేడు జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
- కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్
- ఈ ప్రభుత్వంలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని వ్యాఖ్య
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద ఆలోచనలను ఆయన ప్రస్తావిస్తూ... యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని వివేకానంద నమ్మారని వివరించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో యువత మాత్రం ఆ ఆశయానికి భిన్నంగా ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్లు చెల్లించలేదని, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన... నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి కూడా రెండు సంవత్సరాలుగా చెల్లించకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేయడం వల్ల యువత నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలు కూడా దూరమవుతున్నాయని ఆయన అన్నారు.
ఈ పాలనలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని జగన్ విమర్శించారు. ఇకనైనా మేల్కొని యువతకు అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.