Daryl Mitchell: సరిగ్గా 300 పరుగులు చేసిన న్యూజిలాండ్... టీమిండియా ముందు భారీ టార్గెట్

Daryl Mitchell helps New Zealand score 300 against India
  • భారత్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసిన కివీస్
  • 84 పరుగులతో డారిల్ మిచెల్ టాప్ స్కోరర్
  • ఓపెనర్లు కాన్వే, నికోల్స్ అర్ధశతకాలు
  • భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్‌కు రెండేసి వికెట్లు
వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ముందు 301 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... కివీస్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) అర్ధశతకాలతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించినా, బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత హెన్రీ నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా, కాసేపటికే కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.

అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ భారీ షాట్లతో చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివర్లో క్రిస్టియన్ క్లార్క్ (17 బంతుల్లో 24 నాటౌట్) వేగంగా ఆడటంతో కివీస్ స్కోరు 300 మార్కును అందుకుంది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
Daryl Mitchell
New Zealand
India
India vs New Zealand
Devon Conway
Henry Nicholls
Cricket
ODI
Vadodara
Harshit Rana

More Telugu News