Om Taneja: పాపం వృద్ధ దంపతులు... డిజిటల్ అరెస్ట్ కు భయపడి రూ.14.85 కోట్లు పోగొట్టుకున్నారు!

Om Taneja NRI Couple Loses 14 85 Crore in Digital Arrest Scam
  • ఢిల్లీలో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దంపతులకు భారీ మోసం
  • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ.14.85 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
  • 17 రోజుల పాటు వీడియో కాల్స్‌లో నిఘా పెట్టి మోసం
  • మనీ లాండరింగ్ కేసుల పేరుతో బెదిరించి డబ్బులు బదిలీ చేయించుకున్న వైనం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసు, టెలికాం అధికారులుగా నమ్మించి, 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఓ ఎన్‌ఆర్‌ఐ వృద్ధ డాక్టర్ దంపతుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.14.85 కోట్లు కాజేశారు. దాదాపు 17 రోజుల పాటు వారిని భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా, వారి ఇంట్లోనే వారిని బందీలుగా చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులు నివసిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి (UN)లో సుమారు 48 ఏళ్ల పాటు పనిచేసి, 2015లో పదవీ విరమణ చేసి భారత్‌లో స్థిరపడ్డారు. గత డిసెంబర్ 24న వీరికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము టెలికాం, పోలీసు అధికారులమని పరిచయం చేసుకున్న నేరగాళ్లు, వారిపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని, అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయని బెదిరించారు.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ వృద్ధ దంపతులను, సైబర్ కేటుగాళ్లు 'డిజిటల్ అరెస్ట్' అంటూ భయపెట్టారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు, అంటే దాదాపు 17 రోజుల పాటు వీడియో కాల్ ద్వారా వారిని నిరంతరం నిఘాలో ఉంచారు. ఆర్‌బీఐ, సుప్రీం కోర్టు అధికారులుగా నటిస్తూ నకిలీ పత్రాలు చూపించి మరింత భయపెట్టారు. డబ్బు బదిలీ చేస్తే కేసులు పరిష్కరిస్తామని నమ్మబలికారు.

ఈ క్రమంలో డాక్టర్ ఇందిరా తనేజాను బ్యాంకులకు పంపి, విడతల వారీగా ఎనిమిది వేర్వేరు ఖాతాలకు డబ్బు బదిలీ చేయించారు. ఇలా మొత్తం రూ.14.85 కోట్లు బదిలీ చేయించుకున్నారు. చివరకు జనవరి 10న, "మీ డబ్బులు ఆర్‌బీఐ ఆదేశాలతో తిరిగి వస్తాయి, సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి" అని చెప్పి కాల్ కట్ చేశారు. తీరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక తాము మోసపోయామని దంపతులు గ్రహించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు తీవ్రత దృష్ట్యా స్పెషల్ సైబర్ యూనిట్ (IFSO)కు బదిలీ చేశారు. ఇలాంటి 'డిజిటల్ అరెస్ట్' మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Om Taneja
cyber crime
digital arrest
Delhi police
NRI couple
cyber fraud
money laundering
financial fraud
online scam

More Telugu News