CPI Ramakrishna: జల వివాదాలపై సీఎం రేవంత్ ప్రతిపాదన భేష్..ఆ దిశగా అడుగులు వేయాలి: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Appreciates CM Revanths Proposal on Water Disputes
  • జల వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్న సీపీఐ రామకృష్ణ
  • సమస్య పరిష్కారాానికి రెండు ప్రభుత్వాలు లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని వెల్లడి
  • ముఖ్యమంత్రులు ఇద్దరూ సమావేశమై చర్చించాలన్న రామకృష్ణ
జల వివాదాల పరిష్కారానికి కోర్టులు, కేంద్ర ప్రభుత్వం కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి పరిష్కరించుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పురోభివృద్ధి జల వనరులపై ఆధారపడి ఉందని అన్నారు.

కృష్ణా నదిలో ఇప్పటికే డిమాండ్ ఎక్కువగా ఉన్నందున మనం పూర్తిగా గోదావరిపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. కృష్ణా నదీ జలాలను, అదేవిధంగా సముద్రంలోకి వృథాగా పోతున్న వేల టీఎంసీల గోదావరి జలాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగత విభేదాలు లేకపోవడం, వారు సుహృద్భావ వాతావరణంలో ఉండటం కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. దీనిని ఆసరాగా తీసుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటికి పది సార్లు చర్చలు నిర్వహించి జల వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలని రామకృష్ణ అన్నారు.

వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను వినియోగించుకుంటే తెలంగాణ ప్రాంతంలో సాగు, తాగు నీరు, ఇతర పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు, తాగు నీరు అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. నీటి వివాదాల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలన్నారు. రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా వైషమ్యాలు రెచ్చగొట్టడం కాకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడం మేలని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే సమావేశం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
CPI Ramakrishna
Revanth Reddy
Chandrababu Naidu
Telangana
Andhra Pradesh
Krishna River
Godavari River
water disputes
river water sharing

More Telugu News