Harmanpreet Kaur: ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్... ఢిల్లీపై క్యాపిటల్స్ పై ఘన విజయం

Mumbai Indians Dominate Delhi Capitals with All Round Performance
  • WPL 2026లో ముంబై ఇండియన్స్ విక్టరీ
  • ఢిల్లీ క్యాపిటల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించిన ముంబై
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (74*), నాట్ సివర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు
  • నికోలా కేరీ, అమెలియా కెర్ చెరో మూడు వికెట్లతో బౌలింగ్‌లో విజృంభణ
  • ఢిల్లీ తరఫున ఒంటరి పోరాటం చేసిన చినెల్ హెన్రీ (56)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ముంబై ఇండియన్స్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శనివారం నాడు డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 50 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ సివర్ బ్రంట్ (70) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగగా, బౌలర్లు సమష్టిగా రాణించి ముంబైకి సునాయాస విజయాన్ని అందించారు.

196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, చినెల్ హెన్రీ (33 బంతుల్లో 56) ఒంటరి పోరాటం చేసింది. అయితే, ఆమెకు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. ముంబై బౌలర్లలో నికోలా కేరీ, అమెలియా కెర్ చెరో మూడు వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించారు. నాట్ సివర్ బ్రంట్ రెండు వికెట్లతో రాణించింది. దీంతో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది.

అంతకుముంద, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్కోరు 51 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సివర్ బ్రంట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హర్మన్‌ప్రీత్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలవగా, సివర్ బ్రంట్ 46 బంతుల్లో 13 ఫోర్లతో 70 పరుగులు చేసింది. వీరిద్దరి భాగస్వామ్యంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నందనీ శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.


Harmanpreet Kaur
Mumbai Indians
Delhi Capitals
Womens Premier League
WPL 2026
Nat Sciver Brunt
DY Patil Sports Academy
cricket
T20 league
Chinelle Henry

More Telugu News