Mahesh Goud: వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్
- మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో కథనం
- వాస్తవాలకు దూరంగా వార్తలు వస్తున్నాయన్న మహేశ్ గౌడ్
- నిరాధార వార్తలు ప్రచురించడం మానేయాలని హితవు
తెలంగాణకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో ప్రసారమైన కథనం సంచలనం రేకెత్తించింది. ఈ కథనంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తప్పుడు కథనాలు ప్రసారమవడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని, వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి మంత్రులు, అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారని, అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నిస్తూ, రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిది? అని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారని, కవిత వ్యవహారంతో కేటీఆర్, హరీశ్ రావు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బాగోతంపై కవిత నిజాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు సాధించామని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని... మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు.