Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ వ్యతిరేకించలేదు.. ఎవరూ లేని ప్రాంతంలో కడుతున్నారనే చెప్పారు: సజ్జల రామకృష్ణారెడ్డి
- రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న సజ్జల
- లక్ష కోట్ల బడ్జెట్ సాధ్యం కాదని 2019లోనే జగన్ చెప్పారని వెల్లడి
- అమరావతి టెండర్లను కొన్ని కంపెనీలకే ఇచ్చారని ఆరోపణ
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని... అమరావతి రైతుల పక్షానే ఆయన మాట్లాడారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తోందో ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు పాలన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు వద్ద సరైన సమాధానం లేదని విమర్శించారు. అదే సమయంలో జగన్ అమరావతి అంశంపై లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో తొలి దశలో 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు సరైన న్యాయం చేయలేదని సజ్జల పేర్కొన్నారు. మొదటి దశ రైతుల సమస్యలను పరిష్కరించకుండానే రెండో దశ భూసేకరణకు వెళ్లడంపై ఆయన మండిపడ్డారు. ఇది తప్పుకాదా? అని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ ప్లాట్లకు కనీస మౌలిక వసతులు కూడా లేవని, ఆ ప్లాట్ల వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు.
50 వేల ఎకరాల్లో రాజధానిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని, అప్పటి పరిస్థితుల్లో అంత భారీ పెట్టుబడి సాధ్యం కాదని జగన్ 2019లోనే చెప్పారని అన్నారు. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తే మొత్తం రెండు లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రాధాన్యతల ప్రకారం రైతులకు న్యాయం చేయడం లేదని విమర్శించారు.
సచివాలయ భవనాలు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని చెబుతున్నారని, కానీ తెలంగాణ అసెంబ్లీ కేవలం 10 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఉండగా, పార్లమెంట్ కూడా సుమారు 7 లక్షల చదరపు అడుగులే అని పోల్చి చెప్పారు. ఒక్కో చదరపు అడుగుకు 12 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని, ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని సజ్జల వ్యాఖ్యానించారు.
అమరావతి పేరుతో తమవాళ్లకు లాభాలు చేకూరుస్తూ దోచిపెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల బాధలు పట్టించుకోకుండా ఇతర అంశాలపై మాత్రమే ప్రభుత్వం ప్రశ్నలు ఎదుర్కొంటోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి అడిగితే సమాధానాలు లేవని, కానీ అమరావతిపై రైతుల పక్షాన మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారని వ్యాఖ్యానించారు.
జగన్ అమరావతిలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారని... చంద్రబాబు మాత్రం పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారని సజ్జల ఎద్దేవా చేశారు. డీసెంట్రలైజేషన్ అన్నప్పటికీ జగన్ అమరావతిని పూర్తిగా వదిలిపెట్టలేదని... ఆయన మాటలను కూటమి నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని అన్నారు.
అమరావతి టెండర్లలో కూడా కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థలకే మళ్లీ టెండర్లు కట్టబెడుతున్నారని విమర్శించారు. పదేళ్ల పాటు అమరావతిలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ... హడావుడిగా అమరావతికి వచ్చారని అన్నారు. చేసిన తప్పులు బయటపడతాయనే భయంతోనే ఇలా చేశారని వ్యాఖ్యానించారు.
ఎవరూ లేని ప్రాంతంలో రాజధాని కడుతున్నారని... వైజాగ్ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకే అక్కడికి వెళ్లాలని జగన్ చెప్పారని సజ్జల అన్నారు. వైజాగ్‌ను గ్రోత్ ఇంజిన్‌గా అభివర్ణించిన జగన్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని, కూటమి ప్రభుత్వం కూడా వైజాగ్‌లో పనులు చేస్తూనే ఉందని చెప్పారు.