Chandrababu Naidu: సముద్రంలోకి వృథాగా పోయే నీటి కోసం గొడవలెందుకు?: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Why disputes over water going into sea
  • మిగులు జలాల కోసం ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వద్దన్న చంద్రబాబు
  • పోలవరం పూర్తయితే రెండు రాష్ట్రాలకూ నీటి కొరత ఉండదని స్పష్టీకరణ
  • తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో చంద్రబాబు వ్యాఖ్యలు
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా, రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావిస్తూ.. "కొందరికి నీళ్లు కాదు, కేవలం వివాదాలే కావాలి" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, వివాదాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. 

"ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 300 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరవు అనే మాటే ఉండదు. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తీరతాయి. పోలవరం నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి వంశధార వరకు నీటిని తీసుకెళతాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కూడా మిగులు జలాలను వాడుకోవచ్చు" అని చంద్రబాబు వివరించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, అక్కడి నుంచి రాయలసీమకు నీరందించడం వల్లే ఆ ప్రాంతం హార్టికల్చర్ హబ్‌గా మారుతోందని గుర్తుచేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Telangana
Godavari River
Polavaram Project
Water Dispute
Rayalaseema Lift Irrigation
Pattiseema Project
Irrigation Projects
Telugu States

More Telugu News